విఠల్ నాయక్‌ను సన్మానించిన హోమంత్రి
– వినాయక ఏజెన్సీ సేవలకు అభినందన
– రూ.2లక్షల అవార్డును అందజేసిన మహమూద్ అలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ సన్మానం పొందారు. ఆదివారం ప్రైవేట్ సెక్యూరీటి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బంజార భవన్ లో ఉత్తమ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ అవార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ వేదికపై ప్రైవేటు సెక్యూరిటీకి ఉత్తమ సేవలు అందిస్తున్న తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్: విఠల్ నాయక్ కు చెందిన వినాయక ఏజెన్సీకి ఉత్తమ అవార్డు వరించింది. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ విఠల్ నాయక్ ను అభినందించారు. అనంతరం రూ.2 లక్షల విలువైన అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసి సన్మానించారు. ప్రైవేట్ సెక్యూరిటీకి అందిస్తున్న సర్వీసులు భేష్ గా ఉన్నాయని మంత్రి.. కొనియాడినట్లు విఠల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీకి చెందిన ఉద్యోగులు కర్తవ్య దీక్ష, అంకిత భావంతో మెరుగైన సేవలు అందించినందుకు ఉత్తమ అవార్డు వరించిందన్నారు. ఈ స్పూర్తితో ఏజెన్సీ ద్వారా మరిన్ని ఉత్తమ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల చైర్మన్ డీఎస్ రెడ్డి, అధ్యక్షులు శ్రీకాంత్ జాదవ్, ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, గోపి, మల్లారెడ్డి, మహేష్, ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

