బ్రేకులు ఫేయిల్ అయినా వెళ్లండి
– ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య సమాధానం
– మండిపడిన ప్రయాణికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మనుషుల ప్రాణాలు అంటే ఆర్టీసీ సిబ్బందికి ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సుకు బ్రేకులు ఫేయిల్ అయ్యాయని సమాచారం ఇస్తే అలాగే వెళ్లండి అని సమాధానం ఇవ్వడంతో సిబ్బందిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదివారం ఉదయం తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ29 జెడ్ 3436 అనే నెంబర్ గల బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో బయల్దేరింది. మార్గం మధ్యలోని మన్ సాన్ పల్లి సమీపంలోకి రాగానే బస్సుకు బ్రేకులు ఫేయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై ఆపేందుకు యత్నించినా బస్సు అదుపు తప్పి వన్ సైడ్ కు లాగేసింది. దీంతో డ్రైవర్ బస్సును అక్కడే ఆపేసి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఆర్టీసీకి చెందిన మెకానిక్ బస్సును అలాగే వికారాబాద్ తీసుకెళ్లాలని సూచించినట్లు డ్రైవర్ తెలిపారు. ఈ సమాధానం విన్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. బ్రేకులు ఫేయిల్ అయిన బస్సు అనంతగిరి గుట్ట ఎలా ఎక్కుతుందని, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకులు ఫేయిల్ అయిన బస్సు స్థానంలో మరో బస్సును ఏర్పాటు చేయాల్సింది పోయి.. అలాగే వెళ్లమంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

