విచారణకు రాలేను..!
– 25వరకు గడువు ఇవ్వండి
– ఈడీకి లేఖ రాసిన రోహిత్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కర్ణాటక డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులపై విచారాణకు హాజరుకాలేనని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖను పంపారు. ఇంకాసేపట్లో విచారణకు హాజరు కావాల్సి ఉండగా రోహిత్ రెడ్డి ఈడీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఈనెల 16న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 19న ఆర్థిక వివరాలతో విచారణకు హాజరుకావాలని నోటీసులో సూచించారు. పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఆ రోజు నుంచి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు రాజకీయాలను హీటెక్కించాయి. కాని చివరి క్షణంలో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖ ద్వారా కోరడం థ్రిల్లింగా మారింది. కానీ ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి బ్యాంకు సెలవులు ఉన్నాయని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కావున, విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 25 వరకు సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖలో వివరించారు. హఠాత్తుగా జరిగిన మార్పుతో రాజకీయ వర్గాలలో జోరు చర్చకు దారితీసింది.

