జిప్పం కర్మాగారాన్ని క్లోజ్ చేయండి
– కరణ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు
– స్వయంగా అందించిన సర్పంచ్ జగదీష్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న జిప్పం కర్మాగారంను క్లోజ్ చేయాలని గ్రామ సర్పంచ్ జగదీష్ కోరారు. కర్మాగారాన్ని మూసి వేయాలని ఇచ్చిన ఆదేశాలను భేఖాతారు చేస్తోందని, కర్మాగారంపై చర్యలు తీసుకోవాలని కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కరణ్ కోట్ పోలీస్టేషన్‌పై ఎస్ఐ మధుసూధన్ రెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ శివారులో కొనసాగుతున్న ఇండోస్ కెమికల్ ఫ్యాక్టరీ(జిప్సం కర్మాగారం) నుంచి వెలువడుతున్న కాలుష్యంపై జనవరిలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు ఇతర శాఖల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
దీనిపై గత ఫిబ్రవరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, టా సోఫోర్స్ కమిటీ బృందం తనిఖీలు చేసి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కర్మాగారం వల్ల వాయువు కాలుష్యం, వ్యర్థాల వల్ల నీటికాలుష్యం జరుగుతుందోని నిర్ధారించినట్లు గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రజలే కాకుండా మూగ జీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయని తేల్చారని వివరించారు. ఈ విషయాలను పరిశీలించి కర్మాగారం వల్ల వాయువు కాలుష్యం పాటు, ప్రాణనష్టం ఉందని, వెంటనే కర్మాగారం మూసి వేయాలని మార్చినెలలో ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయినా కూడా కర్మాగారం ప్రతివిధులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. కావున ఈ కర్మాగారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేస్తూ కరణ్ కోట్ ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

