రాగల 24 గంటల్లో..అల్పపీడనం..!
– నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
– రాష్ట్రంలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్
దర్శిని ప్రతినిధి: బంగాళఖాతంలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు, రేపు మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని, ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.


రెడ్ అలెర్ట్ జిల్లాలివే..
భారీ వర్షాలపై ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రభుత్వ అధికారులను సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే సోమవారం వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో సోమవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అదేవిధంగా మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.

