జిల్లా కలెక్టర్ దూకుడు..!
– విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన
– అంగన్వాడి టీచర్‌పై సస్పెండ్ వేటు
– ఉపాధ్యాయురాలుకు మెమో జారీ
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక
– పల్లె ప్రగతిపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కీలక ఆదేశాలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ దూకుడును పెంచారు. ఇటీవల చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. శనివారం చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో అంగన్ వాడి టీచర్‌పై సస్పెండ్ వేటు వేయగా.. నాణ్యత లేని భోజనం పట్ల ఓ ఉపాధ్యాయురాలుకు మెమో జారీ చేశారు. శనివారం జిల్లాలోని కుల్కచర్ల మండలం పీరంపల్లిలో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు భోజనం, గుడ్లు, బాలామృతం సరిగ్గా ఇవ్వడం లేదని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గ్రహించిన కలెక్టర్ అంగన్వాడి టీచర్ వెంకటమ్మను సస్పెండ్ చేశారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో భోజనం నాణ్యతలో లోపాన్ని గుర్తించిన కలెక్టర్ పర్యవేక్షణలోపం కారణంగా ఉపాధ్యాయురాలికీ మెమో జారీ చేశారు.

అదేవిధంగా పల్లె ప్రగతి లో భాగంగా నిర్వహిస్తున్న నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ , పల్లె ప్రకృతి వనంను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో చేపట్టే పనులపై కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పల్లె ప్రగతిలో చేపట్టే లక్ష్యాలను అన్ని వాడుకలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వనమును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా ఎప్పుడు పచ్చగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాచర్లు (వన సంరక్షకులు) సక్రమంగా పనిచేయినట్లైతే కొత్తవారిని నియమించుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోకు సూచించారు. డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరే చేసుకోవాలని అదేవిధంగా కంపోస్ షెడ్డులో చెరువులను తయారు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పది రోజుల్లో పల్లె ప్రగతి పనులను పూర్తి చేసి వాడకల్లోకి తీసుకురానట్లయితే మండల అధికారులతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ తనిఖీలో గ్రామ సర్పంచ్ రాధిక సోమలింగం, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామస్తులు పాల్గొన్నారు.

