పెట్రోల్ పోయడమే పాపమైంది
– అడ్డొచ్చినందుకు కార్మికున్ని గుద్ది చంపారు
– నార్సింగి పెట్రోల్ బంకులో దారుణం
– మద్యం మత్తులో యువకుల ఘాతుకం
రాజేంద్రనగర్, దర్శిని ప్రతినిధి : పెట్రోల్ బంకు మూసే సమయం అయిపోయినా వారికి పెట్రోల్ పోయడమే ఓ కార్మికుడి పాలిట పాపమైపోయింది. క్యాషియర్ మద్య జరిగిన గొడవను అడ్డుకునేందుకు వెళితే.. మద్యం మత్తులో ఉన్న యువకులు కార్మికున్ని గుద్ది చావుకు కారణమయ్యారు. హైదరాబాద్ శివారు నార్సింగి పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక నార్సింగి సమీపం జన్వాడలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. పెట్రోల్ పోయాలని అందులోని యువకులు అక్కడి సిబ్బందిని కోరారు. సమయం అయిపోయిందని.. పెట్రోల్ లేదని బంక్‌లో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న యువకులు చెప్పడంతో కార్మికులు కనికరించి పెట్రోల్ పోశారు. బిల్లు చెల్లింపు చేసే సమయంలో యువకులు తమ కార్డును ఇచ్చారు. స్వైప్ మెషిన్ లేదని.. నగదు ఇవ్వాలని క్యాషియర్ కోరారు. దీంతో తమకే ఎదురు మాట్లాడతారా? అంటూ కారులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. క్యాషియర్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో క్యాషియర్‌ను కొట్టొద్దంటూ సంజయ్ అనే కార్మికుడు అడ్డుపడ్డాడు. అడ్డుగా వచ్చిన సంజయ్‌పైనా పిడిగుద్దులతో విరుచుకుపడటంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. మిగిలిన కార్మికులు సంజయ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతిచెందాడు. మరోవైపు పెట్రోల్ కోసం కారులో వచ్చిన యువకులు అక్కడిని నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సంజయ్ మృతితో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్‌లుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

