ట్రాన్స్జెండర్లకు ప్రాతినిధ్యం చారిత్రాత్మక నిర్ణయం
– చట్టంలో సవరణలు హర్షణీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చారిత్రాత్మకంగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేలా మున్సిపాలిటీల చట్టంలో సవరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇప్పటివరకు సామాజికంగా, రాజకీయంగా అంచున ఉన్న ట్రాన్స్జెండర్లకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారికి నిర్ణయాధికార ప్రక్రియలో స్థానం లభిస్తుందని తెలిపారు.

ఇది కేవలం చట్ట సవరణ మాత్రమే కాదని.. సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం వైపు వేసిన కీలక అడుగు అని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



