రాష్ట్రంలో భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
– కరోనానో.. డెంగ్యూ అనే తేలక భయాందోళన
దర్శని ప్రతినిధి : రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 220 మలేరియా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత ములుగు జిల్లాలో 129 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా
డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 447 డెంగ్యూ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక రంగారెడ్డి జిల్లాలో 115, మేడ్చల్ జిల్లాలో 89 కేసులు, ఖమ్మం జిల్లాలో 128 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దోమల లార్వా డెన్సిటీ హైదరాబాద్ లో 46 శాతం, వనపర్తిలో 46 ఉండగా ఎక్కువ ప్రాంతాల్లో 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపారు. కరోనా వేళ ఏ జ్వరం దేనిదో అర్ధంకాక జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1206కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు