తాండూరుపై దొంగల స్కెచ్..!
– పగలు కస్టమర్ల రూపంలో
– రాత్రి దొంగల ముసుగులో చోరీలు
– అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రోజు రోజుకు దొంగలు స్కెచ్ లు వేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి పడితే ఇళ్లపై కన్ను.. పగలు అయితే కస్టమర్ల ముసుగులో షాపుల్లోకి అడగు పెట్టి మోసాలకు తెగబడుతున్నారు. బంగారం దుకాణాలను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మహిళలు, గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి రావడంతో పట్టణంలో కలకలం రేగుతోంది.

ఇటీవల జరిగిన చోరీలు కొన్ని..
ఆగస్టు 8న బంగారం కొనుగోలు కోసం వచ్చిన మహిళలు.. దుకాణంలో మాటలు కలిపి అదును చూసి నగలు చోరీ చేశారు.
సెప్టెంబర్ 5న తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించారు.
సెప్టెంబర్ 6నా తాండూరులోని ఓ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అదే సమయంలో మరోచోట చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

సీసీ కెమెరాలే కీలక ఆధారం
తాండూరులో దొంగతనాల తీరు పోలీసులకు సైతం సవాల్‌గా మారుతోంది. చోరీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా దుకాణాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అనుమానితుల కదలికలను ఆరా తీస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఘటనల్లో ఒకే తరహా పద్ధతి కనిపిస్తుండటంతో ముఠా వ్యవహారంపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వరుస ఘటనలతో నగల వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు. సాధారణ కస్టమర్లను అనుమానించాల్సిన పరిస్థితి లేకపోయినా.. విలువైన ఆభరణాలు కావడంతో అదనపు జాగ్రత్తలు తప్పడం లేదు. మరోవైపు ప్రజలు కూడా ఇళ్లతో పాటు దుకాణాలు, వ్యాపార సంస్థల భద్రతపై దృష్టి పెడుతున్నారు.

అసలు ఈ చోరీల వెనుక ఉన్నది ఎవరు? ఒక్క ముఠానేనా? లేక వేర్వేరు గ్యాంగ్‌లా? తాండూరునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనేది విచారణలో తెలుస్తుంది.


