ఫొటో పంపితే.. రూ. 500ల రివార్డు
– పార్కింగ్‌ను కొత్త చట్టం ద్వారా అమలు
– ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
– నగదు ఎలా ఇస్తారో చెప్పిన మంత్రి
దర్శిని డెస్క్: ఫోటో పంపితే రూ. 500లు నగదును రివార్డ్‌గా అందిస్తాము. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్వయంగా ఈ ప్రకటన చేశారు. రూ. 500లు ఎందుకు ఇస్తామో.. ఎలా ఇస్తామో కూడ వివరించిన మంత్రి ప్రకటనకు అందరు ఆశ్చర్య పోతున్నారు. దేశంలోని వాహనదారుల్లో మార్పు తీసుకవచ్చేందుకు కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్నామని తెలిపారు.
ఇందులో రోడ్లపై తప్పుగా పార్కింగ్ చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేందుకు పార్కింగ్ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్డుపై తప్పుగా పార్క్ చేసిన వాహనం ఫొటో పంపితే 500 రూపాయల బహుమతి ఇస్తామని తెలిపారు. అది ఎలా అమలు చేయడం జరుగుతుందో వివరించారు.
వాహనాన్ని తప్పుగా పార్క్ చేస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అలాంటి వాహనాల ఫోటో పంపినందుకు 500 రూపాయల బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నిబంధన విని డ్రైవర్లు ఆశ్చర్యపోతున్నారని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే ఇది అమలులోకి వచ్చిన తర్వాత నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. కేంద్ర మంత్రి ఈ ప్రకటన విని కారు, బైక్, ఇతర వాహన చోదకులతోపాటు సామాన్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

