స్టేషన్ హనుమాన్‌లో శ్రీరామ నవమి రద్దు
– ఆలయ పూజారి మరణంతో నిర్ణయం
– వెల్లడించిన ఆలయ చైర్మన్ సంజీవరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని దేవాలయాలు ముస్తాబయ్యాయి. కాని పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్టేషన్ హనుమాన్ దేవాలయంలో మాత్రం వేడుకలను రద్దు చేశారు. ఈ విషయాన్ని బుధవారం ఆలయ చైర్మన్ సంజీవరావు ప్రకటించారు. స్టేషన్ హనుమాన్ దేవాలయం పూజారి శ్రీధర్ పంతులు మరణించిన కారణంగా ఆలయంలో వేడుకలను రద్దు చేయడం జరిగిందని వివరించారు. ప్రతి యేడాది స్టేషన్ హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించే ఆనవాయితీ ఉంది. ఈ సారి కూడా అంతే వైభోగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాని ఆలయ పూజారి శ్రీధర్ పంతులు మరణంతో నవమి వేడుకలు దూరమయ్యాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, వచ్చే యేడాది శ్రీరామ నవమితో పాటు సీతారాముల కళ్యాణోత్సవం జరిపించేలా చూస్తామన్నారు.

