ప్రభుత్వ భూములను కాపాడండి..!
– తాండూరులో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
– కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కబ్జా పర్వం కొనసాగుతోందని, వెంటనే చర్యలు చేపట్టి చెరవిడిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌లోని ప్రాంతంలో, సర్వేనెంబర్ 130లో మున్సిపల్ కార్యాలయం ముందు భాగంలో, వినాయక చౌరస్తాలోని ఓ ప్రాపర్టీని అక్రమార్కులు దుర్మార్గంగా ప్రభుత్వ భూములను అక్రమించారని ఆరోపించారు.

ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావడంలో అధికారులు కుమ్మక్కు అయ్యారని అన్నారు. మున్సిపల్ ముందుభాగంలోని భూమి విషయంలో గత యేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కలెక్టర్ దృష్టికి తీసువచ్చినట్లు తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపించడంతో పాటు అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్లు అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.


