నాణ్యమైన విద్యుత్ సేవలపై దృష్టి

తాండూరు రాజకీయం వికారాబాద్

నాణ్యమైన విద్యుత్ సేవలపై దృష్టి
– 132 కేవీ సబ్ స్టేషన్‌ ఏర్పాటుకు కృషి
– విద్యుత్ సమస్యలపై అధికారులు శ్రద్ద చూపాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలు అందించేందుకు దృష్టిసారించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా, నిర్వహణ, రైతులకు విద్యుత్ సేవలు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

గ్రామాలు, పట్టణాల్లో తరచూ చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ కనెక్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులు రూ.9,100 ప్రభుత్వానికి చెల్లిస్తే ఒక కిలోమీటరు వరకు విద్యుత్ లైన్, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని, అర్హులైన రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి విద్యుత్ అంతరాయాలు, అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

అలాగే భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవి ప్రసాద్, డీఈ సూర్య నాయక్, ఏడీ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మండల అధ్యక్షులు రాజ్‌ కుమార్, పెద్దముల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు ఏఈలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం