కాంగ్రెస్ పార్టీకి షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీకి షాక్..!
– పార్టీకి వరాల శ్రీనివాస్ రెడ్డి గుడ్‌ బై
– వాట్సాప్‌లో జిల్లా అధ్యక్షునికి రాజీనామా పత్రం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్‌ చెప్పారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్‌ ద్వారా డీసీసీ అధ్యక్షులు టీ. రామ్మోహన్‌ రెడ్డికి పంపించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడిన శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరాల శ్రీనివాస్ రెడ్డిని మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఇటీవలే ఆయన పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించి ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించారు.

గురువారం అనూహ్యంగా పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వరాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని, కొందరు వ్యక్తులే పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన నాటి నుంచి అభివృద్ధి చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. పైగా తనను ఫ్లోర్ లీడర్ పదవి నుంచి కూడా తొలగించారని, ఈ కారణాలతో పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తన కొత్త కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.