280 కిలోల బెల్లం సీజ్

క్రైం తాండూరు వికారాబాద్

280 కిలోల బెల్లం సీజ్
– కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా
– నిందితుడి అరెస్టు, రిమాండ్
– వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి కర్ణాటక నుంచి బెల్లం రవాణా చేస్తున్న వ్యక్తి గుట్టును వికారాబాద్ జిల్లా తాండూరు ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. బెల్లం తరలిస్తున్న వాహనంతో పాటు 280 కిలోల బెల్లంను స్వాదీనం చేసుకుని నిందితున్ని రిమాండుకు తరలించారు. తాండూరు ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తండాకు చెందిన రాథోడ్ పాండు అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం కుంచారం నుంచి బెల్లం రవాణా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న తాండూరు ఎక్సైజ్ పోలీసులు గురువారం రాత్రి కర్ణాటక సరిహద్దు కుంచారం – ఓమ్లానాయక్ తండా మార్గంలో రూట్ వాచ్ చేపట్టారు.

ఈ క్రమంలో మహీంద్ర జీటోలో వచ్చిన రాథోడ్ పాండును పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 14 బెల్లం ముద్దలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో ముద్ద 20 కిలోల చొ ప్పున మొత్తం 280 కిలోల బెల్లంను స్వాదీనం చేసుకున్నారు. నిందితునితో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్టేషన్ కు తరలించారు. ఈ మేరకు వాహనాన్ని, బెల్లంను సీజ్ చేశారు. అనంతరం నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.