నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
– ప్రణాళికలతో సిద్దమైన అధికార పార్టీ
దర్శిని ప్రతినిధి: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ పోచారం సెషన్‌కి సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. ఆవరణలో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అటు.. అసెంబ్లీ పరిసరాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నిషేధాజ్ఞనలు కూడా అమలులోకి వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల కోసం అధికార పార్టీ పక్కా ప్రణాళికలతో సిద్దమైంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు చట్టబద్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. వీటితో పాటు మరి కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.
అటు.. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ బీఆర్కే భవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై సంబంధిత శాఖల మంత్రులకు ఇచ్చే ఫైల్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అటు అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయి.
పాదయాత్రగా బీజేపీ
ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా రానున్నారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా రానున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ఇప్పటికే అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. హుజూరాబాద్ ఎన్నిక ఉంది కాబట్టి.. దళితబంధు కేంద్రంగా ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అధికార, విపక్షాలు ఇద్దరికీ అదే ఆయుధం అయ్యేలా కనిపిస్తోంది.

