ముందే పోలింగ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ముందే పోలింగ్..!
– ఓటు వేయనున్న వృద్దులు, వికలాంగులు
– ఇంటివద్దే ఓటు వినియోగించుకునే చాన్స్
– ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల కమీషన్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటివద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇది వృద్దులు, వికలాంగులు, పోస్టల్ విధులకు వెళ్లే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. పోలింగ్‌కు ఒకరోజు ముందు వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోలింగ్‌కు ముందే ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాస్ రావు తెలిపారు. 80 ఏండ్లు నిండిన వృద్దులు, వికలాంగుల నుంచి ఈనెల 23, 24వ తేదిలలో ఓటింగ్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

తాండూరులో మొత్తం 24 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి ఈ రెండు రోజులు ఓటింగ్ స్వీకరిస్తామన్నారు. దరఖాస్తులు చేసుకున్న ఓటర్లు ఈ రెండు రోజులు ఇంటివద్దే ఉండాలన్నారు. ఓటింగ్ స్వీకరణ కోసం రెండు రూట్లను నిర్దేశించడం జరిగిందని, అందులోని ఎన్నికల సిబ్బంది ఉదయం 7-30 గంటల నుంచి బ్యాలెట్ పత్రాలతో ఇండ్ల వద్దకు వెళతారని చెప్పారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటర్లు హక్కును వినియోగించుకోవాలన్నారు. మొదటి రోజు ఇంటివద్ద లేకుంటే రెండో రోజు తప్పక ఇంటి వద్దే ఉండి హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

మరోవైపు పోస్టల్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల నుంచి ఈనెల 21 నుంచి 29వ తేది వరకు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!