22న తాండూరు బంద్..?

తాండూరు రాజకీయం వికారాబాద్

22న తాండూరు బంద్..?
– సానుకూలంగా స్పందించిన వ్యాపారులు
– ఆరోజే బంద్ ఎందుకోసమంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 22న తాండూరులో స్వచ్ఛంద బంద్‌ పాటించాలని నిర్ణయించారు. అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వచ్ఛంద బంద్ పాటించాలని తాండూరు గోశాల సమితి ఆధ్వర్యంలో నిర్ణయించారు. 22న దేశవ్యాప్తంగా హిందూవులు పండగ వాతావరణంలో రామ మందిర ప్రారంభ వేడుకలకు సిద్దమయ్యారు. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి మందిరంలో ఎల్ ఈడీ తెరలపై అయోధ్యలో జరిగే ప్రారంభ వేడుకలను తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోశాలలో సీతారాముల కల్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

వీటన్నింటిని పురస్కరించుకొని 22న వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటించాలని గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాత్రి గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య, ధార్మిక, కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ప్రతి హిందూవు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలలో పాల్గొని అయోధ్య ఉత్సవాలను ఎల్ ఈడీ తెరలపై తిలకించాలని ఆతరువాత గోశాలలో జరిగే కల్యాణంలో పాల్గొనాలని సూచించారు. ఇందుకు వ్యాపార వర్గాలు కూడా బంద్ పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వచ్ఛంద బంద్ పాటించి వ్యాపారులు అయోధ్య ఉత్సవాల విజయవంతంకు సహకరించాలని గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

గోశాల ప్రతిపాదించిన స్వచ్ఛంద బంద్ మంచి ప్రతిపాదన అని వ్యాపార సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. తమ సంఘంలోని సభ్యుల దృష్టికి తీసుకపోయి బంద్ పాటించేందుకు కృషి చేస్తామని వ్యాపార సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోశాల ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి ఓం ప్రకాష్ సోమానితో పాటు పలువురు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం