నా బిడ్డ పరిస్థితి ఎవ్వరికి రావొద్దు..!
– పాఠశాల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి
– ఆవేధన వ్యక్తం చేసిన బాధిత బాలిక తండ్రి
– తాండూరు మండల గిరిజన స్కూల్‌పై ఆరోపణలు
వికారాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే బిడ్డకు రావద్దని, అందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని ఓ బాలిక తండ్రి మీడియా ముందు కోరాడు. తన కూతురు అస్వస్థతకు గురైతే ఆలస్యంగా తెలిపారని, వారి నిర్లక్ష్యం వల్ల బిడ్డ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… వికారాబాద్ మున్సిపల్ వెంకటాపురం తాండాకు చెందిన రాములు నాయక్ అమృత, లోకేశ్వరీ అనే ఇద్దరు కూతుళ్లను తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివిపిస్తున్నాడు.
అమృత 9వ తరగతి, లోకేశ్వరి 7వ తరగతి చదువుతున్నారు. అయితే గత నెల 26వ తేదీన అమృత అనారోగ్యానికి గురైందని, వాంతులు, విరోచనాలు చేసుకుంటుందని పాఠశాల నుంచి తండ్రి రాములు నాయక్‌కు సమాచారం అందించారు. దీంతో హుటా హుటిన రాములు నాయక్ పాఠశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బాలిక స్పృహ కోల్పోవడంతో అంబులెన్స్ లో వికారాబాద్ లోని మాహవీర్ హాస్పిటల్ కు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంతో కోలుకుంటోంది.
ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి రాములు నాయక్ మీడియాతో మాట్లాడుతూ గిరిజన పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డుకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అనారోగ్యానికి గరైన తమ బిడ్డను కాపాడుకునేందుకు రూ. 70వేల వరకు ఖర్చు అయ్యిందన్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్లు నిర్వహకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత లేని ఆహారం, అనారోగ్యం వస్తే సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ బిడ్డకు వచ్చిన పరిస్థితి మరో బిడ్డకు రాకుండా చూడాలని కోరారు.
మరోవైపు పాఠశాల నిర్వహకులను వివరణ కోరగా బాలిక ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదన్నారు. అనారోగ్యానికి గురైన వెంటనే సమాచారం అందించామని తెలిపారు. పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులు అందరు ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఇందులో తమ నిర్లక్ష్యమేమి లేదని తెలిపారు.
ఇదికూడా చదవండి…

