మూతపడిన పాత తాండూరు రైల్వే గేటు
– మరో ఎనిమిది రోజుల పాటు మూత
– మిషన్ భగీరథ, కొత్త ట్రాక్ పనుల కారణంగా నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు మార్గంలో ఉన్న రైల్వే గేటు మూతపడింది. ఈనెల 29వ తేది వరకు రైల్వే గేటు తెరుచుకోదని రైల్వే అధికారులు నోటీసు అంటించారు. ఈ గేటు సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులతో పాటు దక్షిణ మద్య రైల్వే శాఖ పరిధిలోని రైల్వే కొత్త ట్రాక్ పనులను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించినట్లు నోటీసులో వెల్లడించారు. దీంతో పాటు సీసీఐ కర్మాగారానికి వెళ్లే సైడింగ్ లైన్ పనులు కూడ కొనసాగుతాయని నోటీసులో పేర్కొన్నారు. దీని కారణంగా వచ్చే ఎనిమిది రోజుల పాటు రాత్రి, పగలు మొత్తం గేటు మూతపడి ఉంటుందని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు సహకరించాలని సూచించారు. మరోవైపు రైల్వే గేటు మూతపడడంతో పాత తాండూరు – తాండూరు మద్య రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

