‘సర్వే’త్రా.. చర్చ..!
– పథకాల అమలుపై దృష్టి
– వచ్చే ఎన్నికలలో ఇవే కీలకం
– ఫలితాలపై రాజకీయ నేతల విశ్లేషన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకాలపై జోరుగా సర్వే చేపడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు కొత్త పథకాలను అమలు చేసేందుకు తీవ్ర కసరత్తును చేస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు కోసం లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే లబ్దిదారుల గుర్తింపు కోసం తహసీల్దార్లు, ఎంపీడీఓలకు, వ్యవసాయ శాఖ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, వార్డు ఆపీసర్లకు బాధ్యతలను అప్పగించారు. రైతు భరోసా కోసం సాగు యోగ్యత లేని భూముల వివరాలను సేకరిస్తున్నారు.
భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12వేల ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా అందిచేందుకు అర్హులను గుర్తిస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కొత్త రేషన్ కార్డుల లబ్దిదారుల వివరాలను ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఇందిరమ్మ కమీటీల ఆధ్వర్యంలో లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాలలో ఈ పథకాలన్నింటిపై సర్వే చేస్తూ అధికార యంత్రాంగం సందడి చేస్తోంది. అయితే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సర్వేలపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ సర్వేలతో పథకాలను పకడ్బందీగా అమలు చేసి అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరగడం పట్ల ప్రజలు ప్రజా పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త సంక్షేమ పథకాలపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చర్చించుకుంటున్నారు. ఓ వైపు సర్వేలతో పథకాల అమలుపై దృష్టిసారిస్తూనే.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై నజర్ పెట్టినట్లు తాజా పరిణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఓటర్ల జాబితాను సిద్దం చేస్తుంది. ఎన్నికల నిర్వహణపై చర్యలు చేపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సర్పంచులకు, వార్గు సభ్యులకు గులాబీ రంగు, తెలుపు రంగు పత్రాలను కేటాయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సర్వేలు, పథకాల అమలు వచ్చే ఎన్నికలలో కీలకంగా మారనున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ పరిణాలతో పల్లెలు, పట్టణాలు, జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడేక్కుతున్నాయి.
ఇదికూడా చదవండి…

