క్రేజీ.. పందెం కోడి..!
– కోర్టు ఆర్డర్‌తో వేలం
– ప్రెస్ మీట్ పెట్టీ మరి సన్మానం
– దక్కించుకున్న వ్యక్తి ఏమన్నారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కోర్టు ఆదేశాలతో వివిధ సందర్భాలలో వేలం వేయడం చాలా చూస్తుంటాం. కొన్ని అరుదైన సంఘటనలపై వేలం వేసే అర్డర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి అశ్చర్య కర ఉత్తర్వులతో ఓ పందెం కోడికి వేలం పాట నిర్వహించారు. రూ. 300ల కోడిని ఓ వ్యక్తి రూ. 2వేల 300లు పాడీ మరీ దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రెస్ మీట్ పెట్టి సన్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్‌నగర్ పోచయ్య తోట వెనుక కొందరు కోడిపందేలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.
దీంతో ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు రూ.10వేల నగదు, ఒక కోడి పుంజు, 12 కోడికత్తులు, 5 ద్విచక్రవాహనాలు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా కోడి పందెంలు నిర్వహించిన ముఠాను 25వ తేదీన అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. నిందితులతో పాటు పందెం కోడిని సైతం పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితులకు బేయిల్ వచ్చింది కానీ, స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. న్యాయ సలహా మేరకు కోడిని శనివారం రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు.
విచారణ జరిపిన కోర్టు ఆ కోడిని వేలం వేయాలని ఆదేశించింది. రూ.300 నుంచి మొదలైన వేలంలో మొత్తం 12 మంది పాల్గొన్నారు. అదే సమయంలో వేరే పనిపై కోర్టుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొన్నారు. ఈ వేలం పాటలో ఆ కోడిని 2,300 రూపాయలకు దక్కించుకున్నారు. బంజారాహిల్స్‌లో ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోడిని ఘనంగ సత్కరించారు. తనకు మూగ జీవాలు అంటే ఇష్టమని, ఎవరైనా ఈ కోడిని వేలంలో కొనుక్కుంటే ఎక్కడ చంపేసి తినాస్తారేమో అని భయమేసిందన్నారు రామకృష్ణ తాను కూడా వేలంలో పాల్గొని కోడిని దక్కించుకున్నానన్నారు. ఎంత రేటుకైనా దీన్ని కొనుగోలు చేసేవాడినని తెలిపారు. తనకు ఫామ్ హౌజ్ ఉందని, అక్కడ ఉన్న ఇతర జీవాలతో పాటు దీన్ని కూడా అల్లారుముద్దుగా పెంచుకుంటానని రామకృష్ణ చెప్పుకొచ్చారు.
ఇదికూడా చదవండి…

