వామ్మో.. బూ(పి)చ్చోడూ..!
– బాలున్ని ఎత్తుకెళ్లే యత్నం
– పట్టుకుని దేహశుద్ది చేసిన గ్రామస్తులు
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఓ బూచోడు.. బాలున్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో గమనించిన స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అయితే బాలున్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని.. పిచ్చోడు అయి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన యాలాల మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో ఉంటున్న చాకలి మల్లేశం, స్వాతిలు వారి కుమారుడు అభిరాం(8)తో కలిసి ఉగాది పండగ సందర్భంగా యాలాల మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో అడుకుంటున్న అభిమానం బహిర్భూమికి ఒంటరిగా వెళ్లాడు.గమనించిన గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని అపహరించి పొలాల వెంబడి పేర్కంపల్లి తండా వరకు భుజాలపై మోసుకొని వెళుతూ..కింద పడిపోయాడు. అదే అదునుగా భావించిన అభిరాం తండాలోకి పరుగులు పెట్టాడు. వెంటనే అతను కూడా వెంబడించాడు. గమనించిన తండా వాసులు ఆ వ్యక్తిని విద్యుత్తు స్తంభానికి కట్టివేసి చితకబాదారు.

బాలుడి వివరాలు తెలుసుకొని ఎన్కేపల్లిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం యాలాల పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని పోలీసులు విచారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా వ్యక్తి నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం, పర్సాపూర్‌కు చెందిన సాయిలుగా పేర్కొన్నాడు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరోవైపు బాలుడి కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి మతిస్థిమితం లేన్నట్లుగా కనిపించాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసుల విచారణ తరువాత నిజాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.
ఇదికూడా చదవండి…

