ఆసరా ఫించన్ల ఏరివేత..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆసరా ఫించన్ల ఏరివేత..!
– సామాజిక తనిఖీలకు సర్కారు సిద్దం
– అనర్హులను తొలగించేందుకు కసరత్తు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆసరా ఫించన్‌ పథకంలో అనర్హులను ఏరివేసి.. వారికి ఫించన్‌ రద్దు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటి వరకు జాతీయ ఉపాధి హామి పనులపై చేపడుతున్న సామాజిక తనిఖీ విధానంను ఆసరా పథకంపై అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకాన్ని మరింత పారదర్శకంగా, న్యాయంగా అమలు చేయాలని సంకల్పించింది. ఈ దిశగా, పథకాన్ని పూర్తిగా సమీక్షించేందుకు సామాజిక తనిఖీ (Social Audit) నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే దశలో ఉంది. ఆ తనిఖీల ద్వారా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చి, సంబంధిత నిధులను రికవరీ చేయగలిగారు. ఇప్పుడా విధానాన్నే ఆసరా పింఛన్ల పథకానికి కూడా వర్తింపజేసే ప్రయత్నం జరుగుతోంది.

రాష్ట్రంలో ఆసరా ఫథకం కింద వృద్ధాప్య పెన్షన్‌ పొందేవారు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ బోధకాలు బాధితులు, ఇలాంటి అనేక విభాగాలకు చెందినవారు ఫించన్‌ పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కొందరు అనర్హులు కూడా అసలు అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతూ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి గుట్టును రట్టుచేయాలంటే సామాజిక తనిఖీ తప్పనిసరి ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల అనర్హుల వివరాలు బహిర్గతం అవుతాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. నిజమైన అర్హులైన ప్రజలకు మాత్రమే లబ్ది చేరే మార్గం రూపొందించవచ్చు.

ఆసరా పథకం తనిఖీ విధానాలు ఎలాంటి పారదర్శకతతో నిర్వహించాలి, ఎవరు తనిఖీ చేపట్టాలి, ఎవరి ఆధ్వర్యంలో జరగాలి, తనిఖీ ఫలితాలను ఎక్కడ, ఎలా నమోదు చేయాలి, అనర్హులను ఎలా గుర్తించాలి, తొలగించాలంటే ఎలాంటి ధృవీకరణ అవసరం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఈ తనిఖీలు గ్రామ స్థాయిలో జరగాల్సినందున, పంచాయతీ సిబ్బంది, వలంటీర్లు, గ్రామ సభల సాక్ష్యాలతో కూడిన విధానం అమలు చేసేలా సమగ్ర పద్ధతిని ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రూపొందిస్తోంది.

అమలు ఇలా..
ఈ తనిఖీలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. పంచాయతీ రాజ్‌, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో గ్రామ, వార్డు స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వలంటీర్ల ఆధ్వర్యంలో సమీక్షలు జరిపే అవకాశం ఉంది. పెన్షన్ పొందుతున్నవారు తెలుసుకోవాల్సిన విషయం తనిఖీలో మీరు అనర్హుల జాబితాలోకి వెళ్లకుండా, అవసరమైన ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పటిదాకా పెన్షన్ అందుకున్నారన్న కారణంగా అది యథాతథంగా కొనసాగుతుంది అనే భరోసా లేకపోవచ్చు. ఇకపై ప్రతి ఒక్కరూ అర్హత ప్రమాణాల ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదికూడా చదవండి…

గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ