కరుణించు భద్రేశ్వరా..!
– దర్శించుకున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలను కరుణించి కాపాడాలంటూ ప్రసిద్ద భావిగి భద్రేశ్వర స్వామిని మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సింధూజ నరేందర్ గౌడ్ వేడుకున్నారు. జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం ఆమె భద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన భద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లు జాతర ఉత్సవాలు జరుపుకోలేకపోయామన్నారు. ఈ సారి స్వామి దయతో జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. భద్రేశ్వరుడి కృప పట్టణ ప్రజలందరిపై ఉండాలని అభిలాషించారు. తాండూరు పట్టణ వాసులను, భక్తులను భద్రేశ్వరుడు కరుణించి కాపాడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఉన్నారు.

