53 మద్యం దుకాణాలకే లక్కీ డ్రా..!
– వచ్చే నెలనుంచే కొత్త షాపుల నిర్వహణ
– 59 షాపులకు గాను 53 షాపులకు ఎంపిక
– డ్రా తీసి ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ శనివారంతో పూర్తయ్యింది. జిల్లాలోని 59 మద్యం షాప్ లకు గాను 840 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎస్సీలకు 9, గౌడ్లకు 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించారు. శనివారం వికారాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో 59 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను లాటరీ డ్రా పద్దతిలో నిర్వహించారు. మొత్తం 59 షాపులకు గాను 53 షాపులకు మాత్రమే టెండర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో శనివారం నిర్వహించిన టెండర్ల ఎంపికలో 53 మందికే లక్కీ డ్రా ద్వారా టెండర్లు వరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల ఆధ్వర్యంలో మద్యం షాపుల టెండర్ల లక్కీ డ్రా కొనసాగింది. స్వయంగా జిల్లా కలెక్టర్ లక్కీ డ్రా తీసి టెండర్ల కేటాయింపును చేపట్టారు. వికారాబాద్ పరిధిలో-15, పరిగి పరిధిలో- 12, తాండూరు పరిధిలో- 17, కొడంగల్ పరిధిలో – 03, మోమిన్‌పేట్ పరిధిలో – 06 చొప్పున డ్రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు త్వరలోనే లైసెన్సలు అందజేస్తామని తెలిపారు. ఈ మద్యం దుకాణాలను వచ్చే నెల డిసెంబర్, 1వ తేది నుంచి నిర్వహించుకునేందుకు అనుతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, అసిస్టెంట్ కమీషనర్ పల్లవి తో పాటు ఎక్సయిజ్ శాఖ సీఐ లు, యస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
మిగిలిపోయిన టెండర్లు ఇవే
మరోవైపు శనివారం 59 షాపులకు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా 53 షాపులకు నిర్వహించి.. మిగతా 6షాపులను నిలిపివేశారు. వాటిలో కొడంగల్‌లో 5షాపులు, తాండూరులో 1షాపు చొప్పున డ్రా నిలిపి వేయడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే వాటి ఎంపికను నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ నిఖిల వెల్లడించారు. త్వరలోనే నిలిపివేసిన 6 షాపులకు డ్రాలు నిర్వహించి టెండర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.

