తాండూరుపై ప్రత్యేక విజన్..!
– 2028 నాటికి ప్రగతి ప్రణాళికలు సిద్దం
– పట్టణంలో అండర్ డ్రైజేనీని నిర్మిస్తాం
– అసెంబ్లీలో ఇచ్చిన హామిలు నెరవేర్చడమే ధ్యేయం
– మున్సిపల్ ఎన్నికలలో 30 స్థానాలు పక్కా
– చైర్మన్ అభ్యర్థి ప్రకటన ఎన్నికల తరువాతే
– నర్సింగ్ కాలేజీ ఆరోపణలు అవగాహన రహితం
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మూడేళ్లలో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నామని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే కార్యాయలంలో ఆయన మీడియాతో సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి, పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు లభిస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాలను పక్కా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో రైల్వే బ్రిడ్జి, చిలుక వాగు, గొల్ల చెరువు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పాత పనులకు కొత్త ప్రణాళికలు రూపొందించి ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. వచ్చే 2028 నాటికి తాండూరు మున్సిపల్ ఏర్పటై 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో విజన్ 2028 పేరుతో ప్రగతి ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. సుమారు రూ. 550 కోట్లతో తాండూరులో అండర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో రోడ్డు పనులు పూర్తి చేసుకోవడం జరగుతుందని తెలిపారు. రైల్వే బ్రిడ్జి కోసం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ సహాకారంతో మళ్లీ నిధులు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా తాండూరు అమృత్ 2.0 కింద ట్యాంకులు నిర్మించి.. తాగునీటి సమస్య పరిష్కారానికి దృష్టిసారిస్తున్నామని అన్నారు. తాండూరు కాగ్నానది పైప్ లైన్ వ్యవస్థను పురగతి చేసి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అంతరాయానికి ప్రత్యామ్నాయంగా కాగ్నానది నీటిని సరఫరా చేయిస్తామన్నారు. తాండూరులోని నాపరాతి పరిశ్రమను ఒకే దగ్గరికి తెచ్చి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. బైపాస్ రోడ్డు బాధితులకు పరిహారం రూ. 25 కోట్లు ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు.

రూ. 40 కోట్లతో తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు విస్తరించడం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ఎలాంటి అక్రమాలు, ఆక్రమణలు జరగకుండా చూడడంతో పాటు తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామి ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామిని నెరవేర్చడమే ధ్యేయని అన్నారు. తాండూరు నర్సింగ్ కాలేజీ తరలింపు విషయంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అవగాహన రహితమని అన్నారు. తాండూరుకు మంజూరు చేసిన నర్సింగ్ కాలేజీ తాండూరుకే దక్కుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులలో 30 స్థానాలను పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, టీసీపీసీ అధ్యక్షులు, అధిష్థానం నిర్ణయం మేరకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఎన్నికల తరువాతే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా గ్రంథలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, అబ్దుల్ రవూఫ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

