తాండూరుకు కర్ణాటక మత్తు..!
– సరిహద్దులో జోరుగా క్లోరల్ హైడ్రేట్ రవాణా
– పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
– కారులో నుంచి 290 కిలోల సీహెచ్ ప్యాకెట్ల స్వాధీనం
– ఇద్దరు నిందితులపై కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్, మైల్వార్ ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత క్లోరల్ హైడ్రేట్(సీహెచ్) మందు రవాణా జోరుగా కొనసాగుతోంది. గత కొన్నేండ్ల నుంచి కర్ణాటక నుంచి తాండూరు మత్తు మందు రవాణా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్రమ దందాకు చెక్ పెట్టారు. బుధవారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి కర్ణాటక రాష్ట్రం నుంచి రవాణా చేస్తున్న కారులో 290 కిలోల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు నిందితులను తాండూరు ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జోన్ డిప్యూటీ కమీషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమీషనర్ ఎ.చంద్రయ్య ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరిండెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్సైజ్, ప్రోహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మైల్వార్ – కర్ణాటకలోని అడికే మార్గం మద్యలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం సేడంకు చెందిన కలాల్ శివరాములు, వైజ్యనాథ్‌లు సుజీకీ ఎర్టీగా కారు(కేఏ 32డీ 7216)లో క్లోరల్ హైడ్రేట్‌ను రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిలో 10 ప్లాస్టిక్ బ్యాగులను గుర్తించగా అందులో దాదాపు 29 కిలోల చొప్పున సిహెచ్ ఉన్నట్లు నిర్దారించారు. దీంతో కారుతో పాటు నిందితులను అదుపులోకి తీసుకుని తాండూరు ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
ముంబయ్ టు కర్ణాటక, బషీరాబాద్
అయితే ఈ మత్తు రవాణాలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో పట్టుబడిన నిందితులను విచారించగా రవాణా గుట్టును వినిపించారు. ముంబయ్ నుంచి సరుకును కొనుగోలు చేస్తామని, అక్కడి నుంచి కర్ణాటక గుల్బర్గాకు ట్రాన్స్‌పోర్టు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక అక్కడి నుంచి కారులో రవాణా చేసి గుల్బర్గాతో పాటు బషీరాబాద్ మీదుగా రవాణా చేస్తామని వివరించారు. 29 కిలోల చొప్పున బ్యాగును తయారు చేసి ఒక్కో బ్యాగును రూ. 50వేల వరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్‌తో పాటు రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇనుస్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇనుస్పెక్టర్‌లు కూర్మానాయక్, విష్ణుగౌడ్, హెడ్ కానిస్టేబుళ్లు కిషన్ రావు, సుధాకర్, ప్రవీణ్ గౌడ్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

