వాళ్లవి బురద జల్లే రాజకీయాలు..!
– కక్ష్య సాధింపులకు తావులేదు
– అన్ని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు బురద జల్లే రాజకీయాలే పనిగా పెట్టుకున్నారని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ద్వజమెత్తారు.

శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలు, విమర్శలను మీడియా సమావేశంలో ఖండించారు. మున్సిపల్ పాలకవర్గంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు.

తాండూరు పట్టణంలో 36 వార్డుల అభివృద్ధికి సమానంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అయినా కూడా బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏదో రకంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఫ్లోర్ లీడర్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకవచ్చినా.. సౌమ్యంగా వ్యవహరించినా కౌన్సిలర్ భర్త, 8వ వార్డు కౌన్సిలర్లు రహస్యంగా వీడియోలు తీశారని గుర్తుచేశారు. ఈ విషయంలో నిలదీస్తారనే భయంతో 8వ వార్డు కౌన్సిలర్ సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

చైర్ పర్సన్‌గా తమకు అన్ని వార్డులు సమానమే అని అన్నారు. ఎమ్మెల్యే సహాకారంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలలో త్వరలోనే ఎమ్మెల్యే ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ వార్డులపై కక్ష సాధింపులకు ఎలాంటి తావులేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్పూ(నయూం), కౌన్సిలర్లు శ్రీకాంత్, జుంటుపల్లి వెంకట్, రాము, బాలక్రిష్ణారెడ్డి, దివిటి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


