శోభాయమానంగా సాయి బాబా పల్లకి సేవ..!
– పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– ఆకట్టుకున్న భజన కీర్తనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శ్రీ సాయిబాబా వారి పల్లకి ఊరేగింపు మహోత్సవం శోభాయమానంగా ప్రారంభమయ్యింది.

గురు పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం తాండూరులో పల్లకి సేవ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్ పల్లకి ఊరేగింపును ప్రారంభించారు. పల్లకీ ఊరేగింపులో భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులతో పాటు బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, సాయి సేవా సమితి సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతో తాండూరు ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పట్టణంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.


