కంప్లైంట్ కు.. ఎటాక్ కౌంటర్ ఇవ్వడం కాదు
– సమస్యల పరిష్కారంలో పనితీరు చూపండి
– పారిశుద్ద్య సమస్యను కళ్లు తెరిచి చూడండి
– రాజీవ్ కాలనీ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కంప్లైంట్ కు ఎటాక్ కౌంటర్లు ఇవ్వడం.. ఇప్పించడం కాదు.. పాలన తీరును ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించాలని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు.

తాండూరు పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలు, వాహనాలు, డీజిల్ లెక్కలపై కమీషనర్‌కు వినతిపత్రం అందిస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేత కౌంటర్ ఇచ్చిన తీరును కౌన్సిలర్ జావిద్ ఖండించారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య ఏవిధంగా ఉందో.. తన వార్డే నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.

వార్డులో రెండు, మూడు రోజులకు ఒకసారి ఆటో వస్తుందని, ట్రాక్టర్ జాడ లేకుండా పోయిందని విమర్శించారు. పట్టణంలోని 36 వార్డుల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందని, వాహనాలు సక్రమంగా నడవడం లేదని, డీజీల్ వాడకం మాత్రం పెరిగిపోతోందని వివరాలను కమీషనర్ దృష్టికి తీసుకరావడం జరిగిందని వివరించారు. అయితే దీనికి కొందరు కాంగ్రెస్ నేతకు స్క్రిప్ట్ అందించి.. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని అన్నారు.

ఒక సమస్యపై ఫిర్యాదు వస్తే దానిని పరిష్కరించడంలో పనితీరును చూపించాలని, కంప్లైంట్ కు ఎటాక్ కౌంటర్ ఇవ్వడం కాదని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులతో పాటు రాజీవ్ కాలనీ పారిశుద్ధ్య సమస్యపై దృష్టిసారించాలని కోరారు. లేదంటే కాలనీ వాసులతోనే స్వచ్ఛందంగా శ్రమదానం చేయించి.. కళ్లు తెరించేలా ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు.


