రైతు గల్లంతులో విషాధం
– మృతదేహంగా అంజయ్య లభ్యం
– గుర్తించిన మోమిన్ పోలీసులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం టేకులపల్లిలో వాగులో గల్లంతైన అంజయ్య సంఘటనలో విషాధం నెలకొంది. ప్రమాద వశాత్తు వాగులో కొట్టుకుపోయిన అంజయ్య మృతదేహంగా లభ్యమయ్యాడు. గంటల పాటు పోలీసులు శ్రమించి మృతదేహాన్ని గుర్తించారు. గ్రామానికి చెందిన కొండగళ్ల అంజయ్య(55), నాగయ్య, సత్యనారాయణలు మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లి పనులు ముగించుకు వస్తుండగా అయ్యమ్మ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించడంతో వారు వాగులో గల్లంతు కావడం కలకలం రేపింది. అయితే నాగయ్య వీపుపై పురుగుల మందు డబ్బా ఉండడంతో దాని సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు, సత్యనారాయణ కొట్టుకుపోయే క్రమంలో చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరుకోగా అంజయ్య మాత్రం వాగులో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బుధవారం ఉదయం గల్లంతు అయిన ప్రాంతం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో అంజయ్య మృతదేహంగా లభ్యమయ్యాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.




