కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ సమరభేరి
– ఎల్లుండి నుంచి 10 వరకు నిరసన కార్యక్రమాలు
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ సమరభేరికి సిద్దం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం తాండూరు పట్టణంలోని నివాసంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గంలో సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మండలాలు, గ్రామాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించేలా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్ చారి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, కోహీర్ శ్రీనివాస్ యాదవ్, నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


