మట్టి గణపతే.. పర్యావరణానికి రక్ష!

తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టి గణపతే.. పర్యావరణానికి రక్ష!
– సంప్రదాయ కళాకారులకు అండగా నిలుద్దాం
– తాండూరులో వందల సంఖ్యలో మట్టి వినాయకుల ఏర్పాటే లక్ష్యం
– మండపాల నిర్వాహకులకు కందుకూరి రాజ్‌కుమార్‌ సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: భక్తి భావంతో వినాయక చవితిని నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ అన్నారు.

వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని తులసీనగర్‌, సాయినగర్‌, గ్రీన్‌సిటీ, దోబీగల్లి, గుమాసానగర్‌, నెహ్రూగంజ్‌, మార్కండేయ కాలనీ, గాంధీచౌక్‌, కోకట్‌ రోడ్‌, పాత తాండూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపాలను రాజ్‌కుమార్‌ సందర్శించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులను శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తాండూరులో వందల సంఖ్యలో గణపతి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా మట్టి వినాయకుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితిని మార్చేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ఉత్సవ సమితి, బీసీ సంఘం, తాండూరు పెద్దల సహకారంతో మట్టి గణపతుల ఏర్పాటును ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

వినాయక నిమజ్జనాల సమయంలో కాగ్నా నది, కోకట్‌ వాగులు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవాలంటే పర్యావరణహిత గణపతులను ప్రోత్సహించడం అవసరమని అన్నారు. పండుగ ముగిసిన తర్వాత కూడా మన నదులు, వాగులు పరిశుభ్రంగా ఉండేలా చూడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మరోవైపు మట్టి గణపతులను తయారు చేసే కుమ్మరి, ఇతర సంప్రదాయ కళాకారుల కుటుంబాలు తమ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని రాజ్‌కుమార్‌ గుర్తుచేశారు. మట్టి వినాయకుడిని ఎంపిక చేయడం ద్వారా ఒక కళాకారుడి చేతివృత్తికి గౌరవం ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచినట్లవుతుందని అన్నారు. అందుకే ప్రతి మండపం నిర్వాహకుడు, ప్రతి కుటుంబం మట్టి గణపతిని ప్రతిష్ఠించే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.

రాబోయే వినాయక చవితి నాటికి తాండూరులో వందల సంఖ్యలో మట్టి గణపతులు కొలువుదీరేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడతామని రాజ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్‌ షుకూర్‌, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేశ్‌, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్‌, అంబాదాస్‌, పరమేశ్‌, హరిప్రసాద్‌, రాహుల్‌, మాధవ్‌, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేశ్‌, రజక సంఘం నాయకులు రమేష్‌, రాజు, వినయ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాజిక్ చూద్దాం రండి..!