గల్లీ పార్టీ ఇకనుంచి ఢిల్లీ పార్టీ..!
– టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్
– అధికారికంగా ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టుకవచ్చిన గల్లీ గులాబీ పార్టీ ఇక నుంచి ఢిల్లీ పార్టీగా మారిపోయింది. దసరా పర్వదినాన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో తనమైన ముద్ర వేసేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ బుధవారం నుంచి కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ 283 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో తీర్మానం చేశారు. అనంతరం తీర్మానంపై సంతకం చేశారు. ఇన్నాళ్లు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్ ఇకపై జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్నీ చైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. జేడీఎస్ నేత కుమారస్వామి. తమిళనాడుకు చెందిన పిసికే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమలవన్తో పాటు పలువురు ఇతర రాష్ట్ర నేతలు హాజరయ్యారు.
పార్టీ మార్పుపై లేఖ
అయితే, పార్టీ పేరు మార్పుపై సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ సమావేశంలో భారత్ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు. మరో వైపు పార్టీ సీనియర్ నేత వినోద్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు లీగల్ బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలువనున్నట్లు తెలుస్తున్నది. తీర్మానం కాపీని ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్ బీఆర్‌ఎస్ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరుపై అధికారికంగా ప్రకటించనున్నది.
ఆ రాష్ట్రాల్లో పార్టీ ప్రత్యేక దృష్టి
బీఆర్ఎస్.. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో తమకు గెలుపు అవకాశాలున్న వంద సీట్లను గుర్తించిన కేసీఆర్.. అందులో 50 నుంచి 60 స్థానాల్లో గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు నగరాల్లోనూ పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ది మరెక్కడా లేదని.. ఇదే బీఆర్ఎస్‌కు బూస్ట్ ఇస్తుందని కేసీఆర్ అంచనా.

