శభాష్.. విజయ అంకిత..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్.. విజయ అంకిత..!
– గురుకులం నుంచి వైద్య విద్యలో విజయఢంకా
– ఘనంగా సన్మానించిన శ్రీరామకృష్ణ సేవా సమితి, మొలక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ రాధిక దంపతుల కుమార్తె విజయ అంకిత శభాష్‌ అనిపించుకుంది.

గురుకులంలో విద్యనభ్యసించిన ఆమె వైద్య విద్యలో ఎంబీబీఎస్‌ సీటును సాధించి స్పూర్తిని చాటుకుంది. బషీరాబాద్‌ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో చదివిన ఆమె మెడికల్‌ ప్రవేశాల్లో 3730వ స్టేట్‌ ర్యాంకు సాధించి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు పొందింది. గురుకులం నుంచి తొలి ఎంబీబీఎస్‌ సీటు సాధించిన విద్యార్థినిగా నిలిచింది.

ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బషీరాబాద్‌ గురుకులంలో విద్యనభ్యసించి పదో తరగతిలో 9.2 జీపీఏ సాధించింది. అనంతరం అదే గురుకులంలో బైపీసీ ఇంటర్‌ చదివి 988 మార్కులు సాధించింది. వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల మంగళవారం శ్రీ రామకృష్ణ సేవా సమితి, బాలల మాసపత్రిక ‘మొలక’ ప్రతినిధులు గురుకులానికి వెళ్లి ఆమెను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన మార్గదర్శకత్వం అందిస్తే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రోగ్రాం కన్వీనర్‌ కేవీఎం వెంకట్‌, ప్రిన్సిపల్‌ శివగీత, ఉపాధ్యాయులు, సమితి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొత్త ఆధార్.. ఫ్రీ..!