నేత్ర పర్వంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన
– వైభవోపేతంగా ధ్వజ స్థంభ స్థాపన
– ఇందిరా నగర్ రామ మందిరంలో పోటెత్తిన భక్తులు
– అంగరంగ వైభవంగా పునర్ ప్రతిష్టాపన ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్(రాంనగర్)లో సీతారాములు, లక్ష్మణ, హన్మంతుడి విగ్రహ పునఃప్రతిష్టాన ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగాయి. దేవాలయంలో ధ్వజస్థంభ స్థాపన అంగరంగ వైభవంగా జరిగింది.

విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం దేవాలయంలో సీతారాము లక్ష్మణ సమేత విగ్రహాతో పాటు హనుమాన్ విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపనలు నిర్వహించారు.

దేవాలయం ప్రాంగణంలో జయ జయ ద్వానాల మద్య ధ్వజ స్థంబ ప్రతిష్టాపన జరిగింది. దేవాలయానికి పోటెత్తిన భక్తులు జై శ్రీరాం.. జైజై శ్రీరాం అంటూ రామ నామాన్ని మార్మోగించారు. దేవాలయంలో విగ్రహాల పునఃప్రతిష్టాపన సందర్భంగా పట్టణంకు చెందిన పలువురు ప్రముఖులు, కౌన్సిలర్లు, రాజకీయ, వివిధ సంఘాల నేతలు దేవాలయంలో స్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అదేవిధంగా దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు గురువారం నుంచి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాలు జరుగుతాయని, 27న జరిగే కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు.


