అయ్యో.. అయోధ్య నగర్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యో.. అయోధ్య నగర్‌..!
– గుంతలరోడ్లతో ప్రజలకు అవస్థలు
– వర్షం వస్తే రోడ్డంతా బురదమయం
– పట్టించుకోని పాలకులు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అయోధ్య నగర్‌ కాలనీ రహదారులు సమస్యలకు నిలయంగా మారాయి. సరైన రోడ్లు లేకపోవడంతో కాలనీ ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని రహదారులపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు గుంతలను తప్పించుకుంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు చేరి రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చినుకు పడితే చాలు.. కాలనీలోని రహదారులు బురదమయంగా మారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.

కాలనీ రహదారుల సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయోధ్య నగర్‌లో రహదారుల పరిస్థితిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, గుంతలను పూడ్చడంతో పాటు శాశ్వత రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు