886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్‌..!

కెరీర్ టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్‌..!
– మున్సిపాలిటీల్లో భారీ ఉద్యోగ భర్తీకి రంగం సిద్ధం
– ఉన్న ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మున్సిపల్‌ శాఖ నుంచి కీలక సమాచారం వెలువడింది. రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీలు, అప్‌గ్రేడ్‌ చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్లలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు 886 పోస్టుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన పట్టణ స్థానిక సంస్థల్లో పరిపాలన, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో సిబ్బంది అవసరం పెరిగింది. ప్రస్తుతం కొన్ని మున్సిపాలిటీల్లో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకొచ్చి విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో శాశ్వత పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిపాదిత పోస్టుల్లో గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ 20, డిప్యూటీ కమిషనర్‌ 11, జూనియర్‌ అసిస్టెంట్‌ 86, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ 56, హెల్త్‌ అసిస్టెంట్‌ 40, జూనియర్‌ అకౌంటెంట్‌ 40, సీనియర్‌ అకౌంటెంట్‌ 40 ఉన్నాయి. వీటితో పాటు ఇతర విభాగాలకు చెందిన పోస్టులు కూడా ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా 24 మున్సిపాలిటీల ఏర్పాటు, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తం 886 పోస్టులను మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ద్వారా నియామక ప్రక్రియ చేపట్టే అవకాశముంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ప్రతిపాదిత పోస్టులు మాత్రమే. కేబినెట్‌ తుది ఆమోదం, పోస్టుల అధికారిక మంజూరు, TGPSC నోటిఫికేషన్‌ తర్వాతే ఖాళీల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం వంటి అంశాలపై స్పష్టత రానుంది. దీంతో ఉద్యోగార్థులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..!