70 ఫీట్లలో భారీ ముత్యాల ముగ్గు
– అబ్బుర పరిచిన అందాల రంగవల్లిక
– తాండూరు ‘ప్రతిభ ‘ విద్యార్థుల కళా నైపుణ్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : 70 ఫీట్ల విస్తీర్ణంలో వేసిన భారీ ముత్యాల ముగ్గు అబ్బుర పరిచింది. తాండూరులోని ‘ప్రతిభ ‘ పాఠశాల విద్యార్థులు ఈ కళానైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. వచ్చే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పండగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే రంగవల్లులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులు భారీ ముత్యాల ముగ్గు వేసేందుకు సిద్దమయ్యారు.
ఇందులో భాగంగా విద్యార్థులు 70 ఫీట్ల భారీ ముత్యాల ముగ్గును వేశారు. అనంతరం ఇంద్రధనస్సులోని రంగలను ఏరినట్లుగా అందంగా తీర్చిదిద్దారు. చుట్టూరా ప్రతిభ పాఠశాల పేరును రాసి చుట్టు ఆడిపాడి ఆకట్టుకున్నారు. ఈ సంధర్బంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను తమ జీవన శైలిలో అలవర్చుకోవాలన్నారు. సాంకేతికతతో పాటు నైతికతను పెంపొందించుకుని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి పండుగలే పరిరక్షణ సాధనాలని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమ విద్యార్థులు 70 ఫీట్ల భారీ ముత్యాల ముగ్గును వేసి తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం అభినందనీయమన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ను పెంపొందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ నరేష్ కుమార్, యాజమాన్య సభ్యులు నిర్ని చంద్రశేఖర్, పర్యాద రామకృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు మధు, వీరేశం, రేణుక, సంతోషి, స్నేహ, మనీషా, శ్రద్ద సంధ్య, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

