రోడ్డు విస్తరణకు మళ్లీ బ్రేకులు..!
– కూల్చివేతలకు ముందుకురాని యజమానులు
– మరింత ఆలస్యం కానున్న పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిలో కీలకమైన రోడ్డు విస్తరణ పనులకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. విస్తరణలో భాగంగా ఆస్తుల కూల్చివేతలకు యజమానులు దూరంగా ఉండిపోవడంతో పనులు మరింత ఆలస్యం కావడం అనివార్యమైంది. మంత్రి కేటీఆర్ ప్రకటించిన నిధులతో తాండూరులో 2018లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. కాని పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఈ మార్గంలో 94 నిర్మాణాలు అడ్డంకిగా మారాయి. దీంతో 80 అడుగుల వెడల్పుతో నిర్మించాల్సిన పనులు ఒక దగ్గర 27, మరోచోట 30, 33 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఇంకా విస్తరణకు అడ్డుగా వచ్చిన నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్, ఆర్అండ్‌బి అధికారులు ఆస్తుల యజమానులకు నోటీసులు అందజేశారు. దీంతో అప్పట్లో వారు కోర్టుకు వెళ్లారు. ఇందుకు పరిహారం చెల్లించేందుకు ముందుకురావడంతో కొందరు సమ్మతించగా మరికొందలు అంగీకరింలేదు. దాదాపు రెండు, మూడేళ్లుగా రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితమే పెండింగ్‌లో ఉన్న పనులను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి. రైల్వేస్టేషన్ రోడ్డుమార్గంలో ఉన్న ఎంఐఎం అధ్యక్షులు హాది భవనాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దగ్గరుండి కూల్చివేత పనులను ప్రారంభించారు. కూల్చివేతలతో ప్రారంభకావడంతో రోడ్డు విస్తరణ పనులకు మోక్షం వచ్చిందనుకునే తరుణంలో మిగిలిన ప్రాంతంలోని 38 మంది ఆస్తుల యజమానులు కూల్చివేతలకు మొండికేశారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ ఆగిపోయాయి. ఆస్తుల కూల్చివేతలకు యజమానులు స్వచ్ఛందంగా ముందుకువస్తే రోడ్డు విస్తరణ పనులు సవ్యంగా సాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

