ఉక్రేయిన్ విద్యార్థులు వచ్చేశారు..!
– ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు
– తాండూరు విద్యార్థికి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రష్యా – ఉక్రేయిన్ మద్య జరుగుతున్న యుద్దంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకున్నారు. ఉక్రేయిన్లో ఉన్నత చదువులకు వెళ్లిన మెడికల్ విద్యార్థులు ఆ దేశం సరిహద్దు ప్రాంతం స్లోవాకియాకు దాదాపు 17 మంది చేరుకున్న విషయం తెలిసిందే. వారిని భారత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రీజేజూ ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందులో తాండూరులోని అక్సరీ భాగ్ చెందిన ఫయాజ్ అలీ(రియాజ్ అలీ) కూతురు మదీహా ఆనమ్(23) కూడ ఉన్నారు. బుధవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరిన విద్యార్థులు అక్కడి నుంచి హైదరాబాద్కు విస్తారా అనే ఫ్లైట్లో చేరుకున్నారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకున్న విద్యార్థులకు కుటుంబ సభ్యులు సంతోషంగా స్వాగతం పలికారు.
హమ్మయ్యా వచ్చేశారా అంటూ అప్యాయంగా పలకలించారు. మరోవైపు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉక్రేయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా తాండూరుకు చెందిన విద్యార్థిని మదీహా ఆనమ్ కు తాండూరు టీఆర్ఎస్ నాయకులు మసూద్ స్వాగతం పలికారు. ఉక్రేయిన్ విద్యార్థులను క్షేమంగా తీసుకవచ్చిన భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రేయిన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తెలుగు విద్యార్థులు తాండూరుకు చెందిన మదీహా ఆనమ్తో పాటు లిఖిత, ఆకాష్, దుష్యంత్, రాజ్కుమారి, సాయిమణికంఠ తదితరులు ఉన్నారు.

