చిలుకవాగు సేఫ్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చిలుకవాగు సేఫ్‌..!
– ఎమ్మెల్యే కృషితో రాజయోగం
– రూ. 30 కోట్ల నిధులు హర్షణీయం
– చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిలుకవాగు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిధుల మంజూరుతో చిలుకవాగు అభివృద్ధి పనులు వేగవంతమై, పట్టణంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. చిలుకవాగు ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిరంతరం కృషి చేయడం వల్లే రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ చూపి నిధులు విడుదల చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో రూ.16 కోట్లతో ప్రారంభమైన చిలుకవాగు డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జీవోతో ఆ పనులు పూర్తయ్యే మార్గం సుగమమైందని నీరజా బాల్‌రెడ్డి పేర్కొన్నారు.

పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపుతున్న చొరవ ఫలితమే ఈ నిధుల మంజూరు అని ఆమె అన్నారు. చిలుకవాగు ప్రాజెక్టు పూర్తయితే వరద నీటి పారుదల మెరుగుపడి, ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిలుకవాగుకు మహర్థశ..!