రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్కు గుణపాఠం తప్పదు
– తాండూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల యాత్ర
– వచ్చే నెల రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరిని విజయవంతం చేయండి
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్కు గుణపాఠం తప్పదని వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాబు మహాజన్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ శేఖర్లు అన్నారు. భారత రాజ్యాంగంను మార్చాలని సీఎం కేసీఆర్.. చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల యాత్ర ఆదివారం తాండూరుకు చేరుకుంది. ఈ యాత్రకు తెలంగాణ జన సమితి తాండూరు ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు మోజస్, సోమశేఖర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన చేస్తున్నారని అన్నారు. దానిని చట్టబద్ధం చేసుకోవాలనే దురుద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలను చేశారని విమర్శించారు. అంబేద్కర్ వారసులుగా సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వచ్చే నెల ఏప్రిల్ 4న హైదరాబాద్లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభను నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభకు కుల, మతాలకు అతీతంగా అందరు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్, గౌరీ శంకర్, శివప్రసాద్, ఇమ్రాన్, రవికుమార్ నాయక్, మామిడి కరుణా కర్. ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ మల్లికార్జున్, బీ.. జీవన్, మేకల పవర్, బీ. చైతన్య, రవీందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

