బ‌ల్దియా చైర్ ప‌ర్స‌న్‌పై కార్మికుల క‌న్నెర్ర‌

తాండూరు రాజకీయం వికారాబాద్

బ‌ల్దియా చైర్ ప‌ర్స‌న్‌పై కార్మికుల క‌న్నెర్ర‌
– నిరంకుశ పాల‌న న‌శించాలంటూ నిర‌స‌న
– అధికారులు, కార్మికుల‌పై బెదిరింపులు త‌గ‌దు
– పాత మున్సిప‌ల్ వ‌ద్ద కార్మికుల నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ఆ శాఖ కార్మికులు క‌న్నెర్ర చేశారు. సోమ‌వారం ప‌ట్ట‌ణంలోని పాత మున్సిప‌ల్ కార్యాల‌యంలో విధులు బ‌హిష్క‌రించి నిర‌స‌న‌కు దిగారు. ఏఐటీయూసీ మున్సిప‌ల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ నిర‌స‌న‌ను కొన‌సాగించారు. చైర్ ప‌ర్స‌న్ నిరంకుశ పాల‌న న‌శించాలి, అధికారుల‌పై, కార్మికుల‌కు బెధిరింపులు ఆపాలి, అధికారుల‌పై కేసు పెట్ట‌డం ఆపాలి అంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించి చైర్ ప‌ర్స‌న్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.
కార్మికులు చేప‌ట్టిన నిర‌స‌న‌కు జేఏసీ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్, మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ సోమ‌శేఖ‌ర్ మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో పాటు ఏఐటీయూసీ నాయ‌కులు గోపాల్ త‌దిత‌రులు మాట్లాడుతూ తాండూరు మున్సిప‌ల్‌లో కార్మికుల గురించి ప‌ట్టించుకునే నాథుడే క‌రువయ్యార‌న్నారు. మున్సిప‌ల్‌లో 18 మంది కార్మికుల స‌మ‌స్య‌లు, 11వ పీఆర్సీ విష‌యంలో స్పందించ‌డం లేద‌న్నారు. చైర్ ప‌ర్స‌న్, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ విభేధాల‌తో న‌లిగిపోతున్నామ‌న్నారు. మూడు నెల‌లుగా వేత‌నాలు అంద‌క కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఎజెండాపై కోర్టుల‌కెక్కి కార్మికుల జీవీతాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. చైర్ ప‌ర్స‌న్ హోదాలో ఉండి అధికారుల‌పై బెధిరింపుల‌కు, కేసుల న‌మోదుకు పాల్ప‌డ‌డం స‌మంజ‌సం కాద‌ని అభిప్రాయ ప‌డ్డారు. మున్సిప‌ల్‌లో నిరంకుశ పాల‌న న‌శించాలంటూ.. కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ డిమాండ్ చేశారు. కార్మికుల ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న

దేశ వ్యాప్త స‌మ్మె స‌మ్మెలో
అంత‌కుముందు మున్సిప‌ల్ కార్మికులు దేశ వ్యాప్త స‌మ్మెలో పాల్పంచుకున్నారు. విధులు బ‌హిష్క‌రించి కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక వ్య‌తిరేక విధానాల‌ను మానుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ఏఐటీయూసీ నాయ‌కులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ఈ సమ్మెకు మద్దతుగా, తాండూర్ సిపిఐ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్ గారు, సిపిఐ తాండూర్ టౌన్ కార్యదర్శి మునీర్ అహ్మద్ గారు సంఘీభావం తెలిపారు.