ఎజెండాలపై కోర్టుకెళ్లిందెవరు..?
– అభివృద్ధిని అడ్డుకుంటున్న చైర్ పర్సన్
– అధికారులపై నోరుజారడం తగదు
– కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే
– మీడియా సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రవేశ పెట్టిన ఎజెండాలపై కోర్టుకు వెళ్లి అడ్డుపడింది ఎవరనేది చెప్పాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ను ప్రతిపక్ష కౌన్సిలర్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌లు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్‌గా ఉన్న తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌ఫై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఖబడ్దార్ అంటూ అనుచిత వాఖ్యలు చేయడాన్ని వారు ఓ విడియోలో ఖండించారు. అధికారులపై ఈ విధంగా నోరు జారడం సమంజసం కాదని తప్పుపట్టారు. ఓ వైపు తాండూరు పట్టణ అభివృద్ధికి పాటుపడుతున్నాని చెప్పి.. మరో వైపు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వార్డుల అభివృద్ధిపై అన్ని అంశాలను మెజార్టీ సభ్యుల ద్వారా ఆమోదం చేసుకున్న ఎజెండాతో పాటు మున్సిపల్ బడ్జెట్‌పై కోర్టుకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుందెవరో చెప్పాలని ప్రశ్నించారు. పట్టణ ప్రజలపై, అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అధికారులపై నోరు జారే దురుసు ప్రవర్తనను మానుకోవాలని హితవు పలికారు. అధికారులు, పాలకవర్గ సభ్యుల సహాయ సహకారాలతో అభివృద్ధికి పాటుపడాలని, ప్రజల కష్టాలు తెలుసుకొని నడుచుకోవాలని సూచించారు.

