ఉద్దండాపూర్ సమస్యలు తీరుస్తా
– గ్రామానికి మరోవైపు బిటీరోడ్డు
– సరిహద్దు కర్ణాటకకు బస్సు సౌకర్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం ఉద్దండాపూర్, మైసమ్మతాండా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం మండలంలోని ఉద్దండాపూర్, మైసమ్మ తాండాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందర్శించారు. ఉద్దంపూర్లో గ్రామస్తులతో కలిసి గ్రామంలోని సమస్యలపై చర్చించారు. గ్రామానికి కర్ణాటక అర కిలో మీటర్ దూరం మాత్రమే ఉండడంవల్ల కర్ణాటక వెళ్లడానికి గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే గతంలో మాదిరిగానే బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ డిఎం తో ప్రజల ముందు మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా గ్రామంలో ఫార్మేషన్ రోడ్డు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి మరోవైపు మూడు కిలోమీటర్ల దారిలో బిటి రోడ్డు వేయిస్తానన్నారు. తమ సమస్యలను క్షణాలలో పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

