జిప్సం ఫ్యాక్టరీని మూసేయండి

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

జిప్సం ఫ్యాక్టరీని మూసేయండి
– ప్రాణాలు పోతేనే ఎత్తేస్తారా..?
– ఆందోళ‌న చేప‌ట్టిన గిరిజ‌నులు
పెద్దేముల్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: కంద‌నెల్లి.. గొట్ల‌ప‌ల్లి అట‌వీ ప్రాంతంలో కొన‌సాగుతున్న జిప్సం క‌ర్మాగారాన్ని మూసేయాల‌ని నాయ‌కులు, గిరిజ‌నులు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం పెద్దేముల్ – తాండుర్ Y జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళ‌న‌లో పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్‌, వైస్ ఎంపీపీ మ‌ధుల‌త శ్రీ‌నివాస్ చారితో పాటు ప‌లువురు నాయ‌కులు, గిరిజ‌నులు ప్ర‌భుత్వానికి, ఎమ్మెల్యేకు, ఆర్డీఓకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ జిప్సం ఫ్యాక్టరీల నుండి వెలువడే దుర్వాసనతో గర్భిణీ స్త్రీలు అవస్థలకు గురి అవుతున్నారని అన్నారు. చిన్న పిల్లలు మృతి చెందుతున్నారని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ మండిప‌డ్డారు. వెంటనే జిప్సం ఫ్యాక్టరీ వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. వై జంక్ష‌న్‌లో రోడ్డుపై బైటాయించ‌డంతో ఆయా మార్గాల్లో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆందోళ‌న‌ను విర‌మించేలా ప్ర‌య‌త్నం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ జిప్సం క‌ర్మాగారాన్ని తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భీస్మించుకు కూర్చున్నారు. మ‌రోవైపు తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ, రూర‌ల్ సీఐ రాంబాబులు ద‌ర్నా వ‌ద్ద‌కు చేరుకుని ఆందోళ‌న కారుల‌కు న‌చ్చ‌జెప్పారు. ఈ ద‌ర్నాలో కందనెల్లి తండా, హన్మాపూర్, గోట్ల‌ప‌ల్లి, గిర్మాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.