ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
– ప్రజా ఆరోగ్యంపై సర్కారు దృష్టి
– పీహెచ్‌సీలోనూ కార్పోరేట్ వైద్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఇందిరానగర్ లో అర్బన్ ఆసుపత్రి ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఇందిరానగర్ 6వ వార్డులో అర్బన్ పీహెచ్‌సీ ఆసుపత్రిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో, పట్టణాలలోని వాడల్లో బస్తీ దవఖానలు, అర్బన్ పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తుందన్నారు. నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించేలా సీఎం కేసీఆర్ దృష్టి సారించారన్నారు. పేదలకు దగ్గరగా ఏర్పాటు చేస్తున్న పీహెచ్‌సీలోనూ మెరుగైన వైద్య సేవలందిస్తోందన్నారు. తాండూరులో ఏర్పాటు చేసిన అర్బన్ పీహెచ్సీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారని, ల్యాబ్ సదుపాయాన్ని కూడ పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు తాండూరును కాలుష్య రహితం, ఆరోగ్య తాండూరుగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇండస్ట్రీయల్ పార్కు కూడ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా. ధరణి కుమార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, భీంసింగ్, సంగీత ఠాకూర్, సాహు శ్రీలత, అంతారం లలిత, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

